ఓ వైపు ఆటో రిక్షా డ్రైవర్.. మరోవైపేమో...!
జంట నగరాల్లో వరుసగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat
జంట నగరాల్లో వరుసగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్‌లోని సూరారం నివాసి, ఆటో రిక్షా డ్రైవర్ అయిన ఇరవై ఆరేళ్ల బేగరి వేణు కుమార్ అనే వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్, అనుమానితుల డేటాబేస్ ఆధారంగా అరెస్టు చేసినట్లు బాలానగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.సురేష్ కుమార్ తెలిపారు.
మార్చి 6, 2025న జీడిమెట్ల నివాసి రతన్ చంద్ర మండల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మార్చి 5- 6 తేదీల మధ్య రాత్రి గుర్తు తెలియని దుండగులు అతని బావమరిది పింటు ఇంట్లోకి కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించి, రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించి, దోపిడితో పారిపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, పింటు ఇంటిని కవర్ చేసే 160 సీసీటీవీల ఫుటేజీలను విశ్లేషించారు. తెలిసిన నేరస్థులతో మోడస్ ఆపరాండి (MO)ని సరిపోల్చడం ద్వారా అనుమానితుల డేటాను ధృవీకరించి ఎట్టకేలకు వేణు కుమార్‌ను గుర్తించి అరెస్టు చేసింది.
అరెస్టు చేసిన వ్యక్తి వద్ద నుంచి రూ.11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు, అతని సహచరులతో కలిసి గతంలో సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో జరిగిన 30 కి పైగా దొంగతనాల్లో పాల్గొని అనేకసార్లు జైలు పాలయ్యాడు. గతంలో సైబరాబాద్ పోలీసులు అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) చట్టం కింద అదుపులోకి తీసుకుని ఒక సంవత్సరం జైలుకు పంపారు.