చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్‌పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్‌పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డి పోలీసు కస్టడీలో కీలక అంశాలు వెల్లడించారు. కాగా వీరరాఘవరెడ్డికి కోర్టు విధించిన మూడు రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో వీరరాఘవరెడ్డి రామరాజ్యం వ్యవస్థాపన, రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
తాను పదో తరగతి వరకు మాత్రమే చదివినా.. చట్టాలపై, మత గ్రంథాలపై విస్తృతంగా అవగాహన పెంచుకున్నానని వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించాలనుకున్నావని పోలీసులుప్రశ్నించగా..2015లో జరిగిన ఓ ఘటనను వీరరాఘవరెడ్డి కారణంగా చెప్పాడు. తన రెండో తరగతి చదువుతున్న బిడ్డను మూడో తరగతికి ప్రమోట్ చేయకుండా డీటైన్ చేశారని.. దీనిపై అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వివరించాడు. ఈ అన్యాయాన్ని చూసి సమాజాన్ని మార్చాలని, రామరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు చెప్పాడు. తనకు న్యాయం జరగకపోవడంతో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ మార్గాన్ని ఎంచుకున్నానని వీర రాఘవ రెడ్డి అన్నాడు.
బాధల్లో ఉన్నప్పుడు ఓ సాధువు కలిసి జ్ఞానోదయం కలిగించాడని వీర రాఘవ రెడ్డి వెల్లడించారు. అందు కోసం రామరాజ్యం ఏర్పాటుకు సైన్యాన్ని తయారు చేస్తున్నానని వీర్ రాఘవ రెడ్డి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ తనపై అన్యాయంగా కేసులు పెట్టారని పోలీసులకు వీర రాఘవరెడ్డి తెలియజేశారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని రామరాజ్యం ఆర్మీ లో రిక్రూట్ చేసు కోవడమే లక్ష్యంగా ఉంది. ప్రతి గ్రామానికి ఒక సైనికుడిని తన ప్రైవేట్ ఆర్మీకి తయారు చేయాలని ప్లాన్ చేశారు. మ్యూజికల్ టీచర్ గా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించారు. వీర రాఘవరెడ్డి ఒక సన్యాసి మాటల కారణంగా ఆధ్యాత్మికత వైపు మళ్ళారు. అర్చకుల మద్దతు ఉంటే తన ప్రైవేట్ ఆర్మీ మరింత విస్తరిస్తుందని రాఘవరెడ్డి భావించారు. ఇప్పటి వరకు 16 మంది ప్రధాన అర్చకులను వీర రాఘవ రెడ్డి కలిపారు.
ప్రధానంగా రంగరాజన్ పై దాడి చేయడం తప్పేనని వీరరాఘవరెడ్డి అంగీకరించి తన చర్యల పట్ల పశ్చాత్తాపం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో దాడికి దారితీసిన పరిస్థితులను వివరించిన వీర రాఘవరెడ్డి తన చర్యను సమర్థించుకోవడం లేదని స్పష్టం చేశాడు. తన వెంట వచ్చిన అనుచరుల ముందు తనను రంగరాజన్ చిన్నబుచ్చారని, అందుకే అసహనంతో దాడికి దిగాల్సి వచ్చిందని వెల్లడించాడు. రామరాజ్యం స్థాపన కోసం ఇకపై శాంతియుతంగా పనిచేస్తానని చెప్పాడు. నేటితో వీర రాఘవరెడ్డి కస్టడీ ముగియనుండడంతో పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. ఈ కేసులో ఇంకేవరికైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేయనున్నారు.