నేను చాలా బాధతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశా: మర్రి శశిధర్‌రెడ్డి
Senior Cong leader Marri Shashidhar Reddy resigns from party. నేను చాలా బాధతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశా: మర్రి శశిధర్‌రెడ్డి
By అంజి Published on 22 Nov 2022 8:46 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం నిజమైంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కావడంతో దీనికి మరింత బలం చేకూరింది. తాజాగా మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చాలా బాధతో రాజీనామా చేశానని, ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు లేఖ రాశానని, అన్ని వివరాలను వివరించానని శశిధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నందున తెలంగాణ సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తును సూచించిన వారిలో తన తండ్రి ఒకరని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్ పీసీసీ అధ్యక్షుడైన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.
ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మర్రి శశిధర్‌రెడ్డిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకిందని, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం కోల్పోయిందని కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రెడ్డి ఇటీవల సస్పెండ్ అయ్యారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.