సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటుచేసుకున్న చిన్నారిపై అఘాయిత్యం, హత్య ఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకూ ఈ ఘటనపై స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం సైదాబాద్‌లో బాలిక కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి రోజున నగరం నడిబొడ్డున ఈ ఘటన జరిగింది. ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు.
నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై అనుమానాలున్నాయని సీతక్క అన్నారు. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని.. కలెక్టర్‌ను పంపి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇక పలు మీడియాల్లో సినీ యాక్టర్ బైక్ యాక్సిడెంట్ వార్తకు ఇచ్చిన కవరేజ్.. చిన్నారి ఘటనకు ఇవ్వకపోవడం శోచనీయమని సీతక్క అన్నారు.