నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనపై ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు. బోధన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు పికెట్లు కూడా ఏర్పాటు చేశారు.
స్థానిక మున్సిపాలిటీలో తీర్మానం చేసి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన పనులు చేపట్టారు. అయితే.. ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న ఒక వర్గం విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుందని ఊహించిన పోలీసులు రంగంలోకి దిగి.. ఘర్షణ పడుతున్న రెండు వర్గాలను చెదరగొట్టి సెక్షన్ 144 సీఆర్‌పీసీ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.