కార్మికుల జాడ లభించేనా? SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.

By Knakam Karthik  Published on  1 March 2025 11:13 AM IST
Telangana, Nagarkurnool, Slbc Tunnel Accident,  8 People Trapped

కార్మికుల జాడ లభించేనా? SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఎన్‌జీఆర్‌ఐ, జియెలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ ఆధారంగా వారు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జీపీఆర్ పరికరంతో స్కాన్ చేసి 5 అనుమానిత లొకేషన్లను జీపీఆర్ఎస్ సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా అనుమానిత లొకేషన్లలో సహాయక బృందాలు డ్రిల్లింగ్‌ చేపట్టాయి. ఈ ప్రాంతంలో సొరంగ మార్గంలో ఉన్న మట్టి, రాళ్లు, ఇతర లోహాలకు భిన్నంగా సుమారు 3 నుంచి 5 మీటర్ల లోపల మెత్తని పొరలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చేపడుతున్నారు.

అయితే టన్నెల్‌లో మట్టిని మొత్తం తొలగించాలంటే వారాల పాటు సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికుల జాడను తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని నిపుణులు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపించడం ద్వారా మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను కనుగొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తద్వారా కార్మికులు ఎక్కడైనా నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్నట్లుగా నిర్దారణ అయితే కేవలం అదే ప్రాంతంలో తవ్వకాలు జరిపి వారిని బయటికి తీసే వీలు ఉంటుందని తెలుస్తోంది.

మృతదేహాలను గుర్తించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ కొట్టి పారేశారు. ఎన్‌జీఆర్‌ఐ కొన్ని ప్రాంతాలను మాత్రమే గుర్తించిందని, ఆ ప్రాంతాలలో ప్రమాదంలో చిక్కుకున్న వారు ఉంటారన్న నమ్మకం లేదన్నారు. అది లోహం కానీ లేదా మరేదైనా పదార్థం అయినా కావచ్చని వివరించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Next Story