తెలంగాణలో నేటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు
Schools reopen from Today in Telangana.కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 1 Sept 2021 8:34 AM ISTకరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే. కేవలం ఆన్‌లైన్ క్లాసుల ద్వారానే ఇన్నాళ్లు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దాదాపు 16 నెలల తరువాత తెలంగాణ రాష్ట్రంలో నేటి(బుధ) నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. కాగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే.. ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? ప్రత్యక్షంగానా? అనేది ఆయా విద్యాసంస్థలు, విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్టు తెలిపింది.
కాగా.. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను కోర్టు ఆదేశాల మేరకు మరికొంత కాలం మూసి ఉంచనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సమాంతరంగా ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్ కాస్లులైనా.. ప్రత్యక్షంగా హాజరు అయినా కూడా పాఠాలను వినొచ్చు. ఇంటర్, డిగ్రీ సహా అన్ని రకాల కాలేజీల్లో మాత్రం ప్రత్యక్ష తరగతులే నిర్వహిస్తారు. ఇక విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఇక పాఠశాలలో ఉన్నప్పుడు ఏ విద్యార్థి అయిన కరోనా బారిన పడితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. ఒకవేళ అలా చేస్తే సూళ్ల అనుమతులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
విద్యార్థులను సూళ్లకు పంపేటప్పుడు వారి తల్లిదండ్రులు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు మాస్క్ ధరించేలా చూడడంతో పాటు శానిటైజర్ వాడడాన్ని నేర్చించాలన్నారు. పాఠశాల నుంచి రాగానే స్నానం చేయించాలని చెబుతున్నారు.