కొవిడ్ కేంద్రాలుగా బడులు..?
Schools as covid Centers.ప్రధానంగా ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు శిక్షణ సంస్థల్ని కరోనా కేర్ కేంద్రాలుగా మార్చేందుకు అనువుగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 28 April 2021 5:47 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలోనే నమోదు అవుతున్నాయి. దీంతో గ్రేటర్‌లోని ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయించే పేషంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భారం తగ్గించడంతో పాటు కరోనా పాజిటివ్ రోగుల ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ముందుగా.. ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చనే దానిపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. ముందుగా సమగ్ర సమాచారాన్ని సేకరించిన తర్వాత అవసరాన్ని బట్టి కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు శిక్షణ సంస్థల్ని కరోనా కేర్ కేంద్రాలుగా మార్చేందుకు అనువుగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏయే జోన్లలో ఇవి ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయి? వాటి సామర్థ్యం ఎంత? అనే దానిపై సర్వే చేయాల్సిందిగా ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అన్ని జోనల్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి.
ముందుగా ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ శిక్షణ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. వీటిల్లోనైతే కిచెన్లు ఉన్నందున కొవిడ్ కేర్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే రోగులకు ఆహారాన్ని అందించడం సులువు అవుతుందని భావిస్తున్నారు. అసలు లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చినవారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారిని ఈ కేంద్రాల్లో ఉంచడంతో 10-14 రోజుల్లో కోలుకుంటారు. నిర్ణీత సమయానికి ఆహారం, మందులు అందిస్తే సరిపోతుంది. మున్ముందు అవసరాన్ని బట్టి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.