తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ శంషాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్తారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు వద్దకు చేరుకుంటారు. వేదికల విషయానికి వస్తే.. రాహుల్ గాంధీ ముఖ్య నాయకులకు ఒకే వేదిక.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఏర్పాటు చేశారు. ఇక 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగాలు ఉంటాయి.
7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగం ప్రారంభం అవుతుంది. సభ తరువాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్ కు చేరుకుంటారు. దుర్గం చెరువు పక్కన ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ లో రాహుల్ బస చేస్తారు. 7వ తేదీ ఉదయం హోటల్ కోహినూర్ లో ముఖ్య నాయకులతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి మొదట సంజీవయ్య పార్క్ కి వెళ్లి నివాళులు అర్పిస్తారు. అక్కడ నుండి నేరుగా గాంధీ భవన్ కు చేరుకుంటారు. అక్కడ దాదాపు 300 మంది ముఖ్య నాయకుల తో సమావేశం అవుతారు. డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలర్స్ తో ఫొటో సెషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్ ఉంటుంది. అనంతరం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.