సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో.. కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. తాజా నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని అన్నారు. దీంతో ఈ ఏడాది మార్చి 31 నుండి జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మళ్లీ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తద్వారా 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరనుందని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. అలాగే.. కారుణ్య నియామకాల్లో పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకూ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సింగరేణి ఉద్యోగాల్లో 10శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు సీఎండీ చెప్పారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగబేధం లేకుండా అవకాశాల అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు వివరించారు.