తెలంగాణలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీల వేతనం పెంపు : ఆమె అడిగినందుకేనా.?

Sarpanch MPP Salaries Hike. తెలంగాణలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీల గౌరవవేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం

By Medi Samrat  Published on  29 Sep 2021 5:41 AM GMT
తెలంగాణలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీల వేతనం పెంపు : ఆమె అడిగినందుకేనా.?

తెలంగాణలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీల గౌరవవేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్‌లకు ఇప్పటి వరకు నెలకు రూ. 5 వేల వేతనం చెల్లిస్తుండగా, దానిని రూ. 1500 పెంచి రూ. 6,500; జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 10 వేలకు రూ. 3 వేలు పెంచి రూ. 13 వేలు చేసింది. సాధారణంగా ఇలాంటి పదవుల్లో ఉన్న వాళ్లకు జీతాలు చాలా తక్కువ.. అయితే తెలంగాణ ప్రభుత్వం కాస్త ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదల జూన్‌ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను కొత్త పీఆర్‌సీ ప్రకారం 30 శాతం పెంచిన నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సైతం అదే స్థాయిలో పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంపై మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ కార్యాలయాల్లో కనీస మర్యాద ఉండటం లేదని, కనీసం వారు కూర్చోనేందుకు కుర్చీ కూడా ఉండటం లేదని ఎమ్మెల్సీ కవిత సోమవారం మండలిలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజులు గడవకముందే వారికి ప్రభుత్వం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


Next Story
Share it