తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ (టీపీసీసీ) రేవంత్ రెడ్డి నియామకం జరిగినప్పటి నుంచి సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మరి కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి త్వరలో కాంగ్రెస్‌ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. నేడు సంగారెడ్డి కార్యకర్తలతో సమావేశమై సంచలన నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన శుక్రవారం తన ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. వారి నుంచి కీలక సమాచారం రాబట్టి, నేడు సంగారెడ్డిలో మరోసారి కార్యకర్తతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ మొత్తం రాజీనామాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
నిన్న జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో జగ్గారెడ్డి ఉద్వేగానికి లోనైనట్లు సమాచారం. తనను కోవర్టుగా ప్రచారం చేస్తున్నారని పార్టీ రాష్ట్ర నాయకత్వంపై జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత మంగళవారం సంగారెడ్డిలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు. పెళ్లయిన ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకం కింద ప్రభుత్వం రూ.1,01,116 అందించడం సంతోషకరమన్నారు.