సంచలన వ్యాఖ్యలు, సంచలన నిర్ణయాలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఏడాదిన్నరలో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి బుధవారం జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తను బరిలోకి దించుతానని చెప్పుకొచ్చారు. తన భార్య నిర్మలతో కలిసి బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు.
తనకు బదులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్యకర్తను బరిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోతే, తన స్థానంలో తన భార్య చేత పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు జగ్గారెడ్డి, 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని.. తాను ఒక టర్మ్ ఎందుకు దూరంగా ఉంటున్నానో తర్వాత తెలుస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా సంగారెడ్డి నియోజకర్గంలో తాను రేపటి నుంచి పాదయాత్ర చేయనున్నట్టుగా జగ్గారెడ్డి వెల్లడించారు