మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు.
మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. ఇంతలో అక్కడ ఓ విషాదం కూడా చోటు చేసుకుంది. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతిచెందాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన చింతల కొమురయ్య(68) తన కుటుంబు సభ్యులతో కలిసి మేడారం వచ్చాడు. వీరంతా జంపన్న వాగు అవతలి వైపున విడిది చేశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే కొమురయ్య మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.