తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అసలు దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమన్నారు. సీబీఐ సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని, ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఎల్లో మీడియాకు ముందే తెలుస్తుందని, సీబీఐ విచారణ ఏ విధంగా చేస్తోందో అర్థం కావట్లేదన్నారు. ప్రజల్లో అయోమయం సృష్టించేలా సీబీఐ తీరు ఉందని అన్నారు సజ్జల. ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం సీబీఐ నడుస్తోంది.. ఆ స్క్రిప్ట్‌కే విచారణ అని తగిలిస్తున్నారన్నారు.
ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారు. సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోంది. సీబీఐ కౌంటర్ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ తీరులో విపరీత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు సజ్జల.