తెలంగాణలో స్కూల్స్ మూసి వేయనున్నారా..?
Sabitha Indra Reddy About Rumours On Schools Shut Down. ఇటీవలి కాలంలో తెలంగాణలోని కొన్ని స్కూల్స్ లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి
By Medi Samrat Published on 7 Dec 2021 1:06 PM GMTఇటీవలి కాలంలో తెలంగాణలోని కొన్ని స్కూల్స్ లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. మరో వైపు ఒమిక్రాన్ టెన్షన్స్ వెంటాడుతూ ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలతో స్కూళ్లు మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఖండించారు. పుకార్లను నమ్మవద్దని, పాఠశాలల్లో పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పాఠశాల సిబ్బంది, పిల్లల పేరెంట్స్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బడులు మూసివేస్తారన్న పుకార్లు నమ్మవద్దని, విద్యాలయాల్లో కరోనా కేసుల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పేరెంట్స్ కి మంత్రి భరోసా ఇచ్చారు. పాఠశాలల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వందశాతం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సబిత సూచించారు. సోషల్ మీడియాలో పాఠశాలల మూసివేత అంటూ వస్తున్న రూమర్స్ ను నమ్మకండని అన్నారు.
ఇప్పటికే రెండేళ్లు విద్యార్థులు నష్టపోయారని, పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్కడక్కడ స్కూళ్సు, గురుకుల పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు వాస్తవమేనని.. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని కోరారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.