హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ లేదా రేపు ఎకరాకు రూ.6 వేల చొప్పున వేయనుంది. ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. జమ కానీ వారు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలి. కాగా ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించింది.
వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా ఎకరాకు రూ. 12వేలు అందజేసేందుకు నిర్ణయించింది. ఫస్ట్ ఫేజ్‌లో ప్రస్తుతం అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేలు జమ చేస్తుంది. జనవరి 26వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ముందుగా 563 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది. రెండో విడతగా ఎకరం సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇటీవల ప్రభుత్వం అందించింది. ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నగదును ప్రభుత్వం జమ చేసేందుకు సిద్ధమైంది.