హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు పథకాలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లలో జమ చేయబోతోంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని సమాచారం. అక్టోబర్ 1 నుంచి దసరా పండుగ మధ్యలో రైతుల ఖాతాల్లో భరోసారి నిధులు జమ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేపు కేబినెట్‌లో చర్చించిన తర్వాత విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15,000లను ఇవ్వాల్సి ఉంటుంది. 1.53 కోట్ల ఎకరాలకు రూ.11,475 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అయితే రైతు భరోసాను అందరికీ ఇస్తారా? లేదా కొర్రీలు పెడతారా అనేదానిపై స్పష్టత లేదు. బీడు భూములకు రైతు భరోసా ఇవ్వమని ఇప్పటికే మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. రైతు రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ పథకాలకు తెల్ల రేషన్ కార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. రైతు భరోసా పథకానికి కూడా వైట్ రేషన్ కార్డును లెక్కలోకి తీసుకుంటారా లేదా అన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.