రైతు బంధు డిపాజిట్లు.. దాదాపు రూ.50 వేల కోట్ల మార్క్‌కు చేరువ.!
Rythu Bandhu Scheme deposits inching close to Rs 50,000 crore mark. రైతు బంధు డిపాజిట్లు.. దాదాపు రూ.50 వేల కోట్ల మార్క్‌కు చేరువ.!
By అంజి Published on 3 Jan 2022 5:23 PM IST
రైతు బంధు పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన మొత్తం డిపాజిట్లు ప్రారంభించినప్పటి నుండి రూ. 50,000 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. సోమవారం నాటికి ఈ పథకం ఎనిమిదో సీజన్‌లో 57.6 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294 కోట్లు జమ అయ్యాయి. గత ఏడు దశల్లో రైతు బంధు పథకం కింద రాష్ట్రంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.43,036.63 కోట్లు జమ చేయబడ్డాయి. యాసంగి పంటకు రైతులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లను వ్యవసాయ శాఖకు విడుదల చేసింది.
రైతు బంధు పంపిణీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, పథకం కింద ఖర్చు చేసిన మొత్తం రూ. 50,000 కోట్ల మార్క్‌ను దాటుతుంది. జనవరి 10 నాటికి రాష్ట్రంలోని 66.61 లక్షల మంది రైతులకు ప్రస్తుత సీజన్‌లో పెట్టుబడి మద్దతు మొత్తం అందుతుంది. పంపిణీ జరిగిన ఐదో రోజు నాటికి 4.89 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,047.41 కోట్లు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఉన్న నిబద్ధతకు ఈ పథకం నిదర్శనమని అన్నారు.
"రైతులు అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని సహకారాలను మేము అందిస్తున్నాము. రాష్ట్రం సాధించిన అరుదైన విజయాలను, రైతు అనుకూల విధానాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు వారం రోజుల పాటు జరిగే రైతు బంధు వేడుకల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి ప్రగతిశీల ఆలోచనలు, చురుకైన చర్యలను అనుసరించి, కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టబడింది. తద్వారా రాష్ట్రంలో మొత్తం వార్షిక సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలకు పైగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా, సాగునీటి సరఫరా, ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికే దాదాపు రూ.60,000 కోట్లు ఖర్చు చేస్తోంది.