తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిర్వహించ తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలు కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. లోకేష్ కుమార్, నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్ తో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.