రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది ప్రయాణికులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కంకర కింద మృతదేహాలు కూరుకుపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదం ధాటికి బస్సు కుడి వైపు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆపై బస్సుపై బోల్తా పడింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సంరక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.