వీడిన సందిగ్ధత..ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై
ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
By Srikanth Gundamalla
వీడిన సందిగ్ధత..ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై
రెండ్రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మతి తెలిపారు. దాంతో.. ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై ముందు గవర్నర్ తమిళిసై పలు సందేహాలు లేవనెత్తారు. దాంతో.. సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. కొన్ని స్పష్టత లేని అంశాలు ఉన్నాయని వివరణ ఇవ్వాలని కోరింది గవర్నర్. దాంతో.. వెంటనే స్పందించిన ప్రభుత్వం కూడా.. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. దాంతో.. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ కొనసాగింది. చివరకు రవాణాశాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో తమిళిసై సమావేశం అయ్యారు. గవర్నర్ లేవనెత్తిన సందేహాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. ఆ సమావేశం అనంతరమే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ విలీనం బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో పాటు ప్రభుత్వానికి గవర్నర్ 10 అంశాలను సిఫార్సు చేశారు. న్యాయపర అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాలను గవర్నర్ తమిళిసై పంపిన సిఫార్సులో పేర్కొన్నారు.
గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు కొనసాగడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందారు. ఒకానొక దశలో ఆర్టీసీ విలీనం ఇప్పుడు ఉంటుందా.. సమయం పడుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ.. చివరకు ప్రభుత్వం గవర్నర్‌కు అన్ని రకాల వివరణలు ఇవ్వడంతో గవర్నర్ తమిళిసై ఆర్టీసీ విలీనం బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు సంతోషపడుతున్నారు. ఆర్టీసీ విలీనం బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది... బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమలు చేయనున్నారు.