హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు రుణాలు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను సెర్ప్‌కి ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు రూ.44 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో నేటి నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. కాగా ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేదే తమ లక్ష్యమని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
కాగా వడ్డీ లేని రుణాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణపథకం 2005లో అమల్లోకి వచ్చింది. బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకునే సభ్యులకు వర్తింపజేయగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 వరకు ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత పావలా వడ్డీ డబ్బులు వారి అకౌంట్లో వేయడం నిలిపి వేశారు. తొమ్మిదేళ్ల తర్వాత వడ్డీ లేని లోన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.