ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి త్వరలోనే సాయం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నారని, వారికి వరద నష్టాన్ని వివరించి ఆర్థికసాయం కోరతారని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారం గ్రామంలో శనివారం వరదలతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లు పై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామన్నారు. వరద విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున త్వరలో జమ చేస్తామని చెప్పారు.