'డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి'.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
By అంజి Published on 29 Feb 2024 5:43 AM GMT'డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి'.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దాదాపు 4 లక్షల మందికి కేవలం 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ నిర్వహించిందని, మీరు (సీఎం రేవంత్) ఏటా రెండు సార్లు చేపట్టాలని కోరారు. నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను సీఎం రేవంత్ ముందు ఉంచి, వాటిని పరిశీలించాలని కోరారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. సీఎం రేవంత్ ముందు ఉంచిన అంశాలు ఇవే..
1. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఎడ్ (BEd) అభ్యర్థులకు ఎస్జీటీ (SGT) పోస్టులకు అర్హత లేనట్లే. ఈ లెక్కన కొత్త BEd కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిది.
2. బీఎడ్ చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు. వాళ్ల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలు ఉన్నది. కాని కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నయి. ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరు.
3. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ (TET) నిర్వహించింది. నిజానికి టెట్ సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించాలి. ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది. లేదా టెట్, డీయస్సీ రెండూ ఒకే సారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్ కాబట్టి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు.
4. ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్లో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది. అంటే 70%పదోన్నతి, 30 %డైరెక్టు రిక్రూట్మెంట్. దీని వల్ల బీ ఎడ్ (BEd) అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో vitality దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని 50:50 లాగా సర్వీసు రూల్స్ ను మారిస్తే అందరికీ లాభమైతది.
5. చాలా కాలంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయింది. వీళ్లను ఎంత అర్జంటుగా రిక్రూట్ చేస్తే (ప్రతి స్కూల్ కు ఒకరు) అంత మంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా,ఆరోగ్యంగా తయారైతరు.
6. పాఠశాలల్లో మానసిక నిపుణులను (కౌన్సిలర్లు) ను నియమిస్తే తప్పకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
7. డీఎస్సీ 2008 అభ్యర్థులు న్యాయం కోసం తొక్కని గడపలేదు. వారికి పక్క రాష్ట్రం లో న్యాయం జరిగింది. మన దగ్గర కూడా వాళ్ల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయగలరు.
8. గురుకులం ఆశావహులు బ్యాక్‌లాగ్ ఖాళీలను ఎలాగైనా నివారించేందుకు 'అవరోహణ క్రమంలో' రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.