ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్​ఎస్ ప్రవీణ్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 10:36 AM GMT
rs praveen kumar, high court, telangana , elections,

ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్​ఎస్ ప్రవీణ్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగజ్‌నగర్ పీఎస్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కొంత మంది బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడి చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌పై కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది. ఈ నెల 13వ తేదీన రాత్రి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఈ కేసు నమోదైంది.

ఈ నెల 12వ తేదీ రాత్రి నుంచి కాగజ్‌నగర్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సభలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో.. ఉద్రిక్తత నెలకొంది. బీఎస్పీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రచార వాహనాలు మరింత బిగ్గరగా సౌండ్ పెట్టారని.. ఇవి కాస్త ఘర్షణకు దారితీసిందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్, బీఎస్పీ నాయకులు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకు దిగారు. కానీ బీఆర్‌ఎస్ నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సోమవారం రాత్రి సైతం ఇదే విధంగా జరిగింది. దీంతో ఈ ఘటన ఇరువైపుల ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత పోలీసులు ప్రవీణ్ కుమార్, బీఎస్పీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఇదే విషయంలో తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story