ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.. రఘురామపై విమర్శలు
RS Praveen Kumar Fires On Raghurama krishnam Raju. మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
By Medi Samrat Published on 9 Aug 2021 7:31 AM GMTమాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. దేశం సంపద కేవలం గుప్పెడు మంది చేతుల్లో ఉందని, మన డబ్బును మనకే బిచ్చం వేసినట్టుగా పంచుతూ అదేదో మహోపకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ విచ్చల విడిగా డబ్బులు ఇపుడెందుకు ఖర్చు చేస్తున్నారు? ఆయన పంచుతానన్న వెయ్యి కోట్లు ఎవరివి? కేసీఆర్‌కు దళితులపై అంత ప్రేముంటే.. ఆయన సొంత ఆస్తులను అమ్మి పంచాలని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు.సభకు వస్తున్న వారిని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని.. అయినా మా బిడ్డలు ఆగరని ఆయన అన్నారు. సారో.. ఎక్కడున్నరు.. మాబిడ్డలు ఆగరు.. అంటూ కేసీఆర్‌ని ఉద్దేశించి సెటైర్లు వేశారు.బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరు. అందరూ పాలకులే ఉంటారని చెప్పారు. బహుజనులంతా పాలకులవుతారని.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కి వెళతామని, ఎర్ర కోటపైనా నీలి జెండా ఎగర వేస్తామని ఆయన అన్నారు.
ప్రజలు కారు కింద పడతారా.. ఏనుగెక్కి వెళ్తారా తేల్చుకోవాలని సూచించారు. రిజర్వేషన్లు మన హక్కు అని.. పాలకులు పెట్టే భిక్ష కాదన్నారు. ఉద్యోగం ఎందుకు మానేశావని తన అమ్మ అడిగిందని.. లక్షలాది మంది బిడ్డల బతుకు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని తాను చెప్పానని గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల పోలీసు జీవితాన్ని వదులుకొని 2012లో గురుకులాల సొసైటీకి వచ్చానని చెప్పారు. తొమ్మిదేళ్ల లో ఎన్నో గొప్ప పనులు చేశానన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేశారని.. ఒక ఇంజినీరింగ్ కళాశాలను మాట్లాడుకొని.. అక్కడే ఉంచి చదువుకుంటుంటే ఎవరో సమాచారం ఇవ్వడంతో... జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు వచ్చి.. పిల్లలను వారికి ఇంటికి పంపించేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తనపై పార్లమెంట్ సాక్షిగా అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. బహుజనులు ఎదుగుతుంటే చూడలేకనే రఘురామ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. రాజకీయాలు ఒక్క మీకు మాత్రమే సొంతం కాదని విమర్శించారు.