రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar Comments On Politics. ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 20 July 2021 5:50 PM IST
ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే..! ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం కూడా చేశారు. ఓ వైపు పలు ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్న తరుణంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారిపోతుందని చెప్పడం సరికాదని అన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
రాబోయే రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తానని.. ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని అన్నారు. ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతుండగా.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారని మరి కొందరు అన్నారు. ఇంకొందరేమో టీఆర్ఎస్ లోకి వస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆయన పూర్తిగా వ్యతిరేకమని... అందువల్ల బీజేపీలో చేరే అవకాశాలు ఏమాత్రం లేవని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు.
స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రవీణ్ కుమార్ సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖను పంపారు. తాను ఎందుకు రాజీనామా చేయబోతున్నది తెలియజేస్తూ ప్రజలకు రెండు పేజీల లేఖ ద్వారా వివరించారు. రెండు పేజీల లేఖను ట్విట్టర్ లో వెల్లడించారు. 1995 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ అదనపు డీజీపీ హోదాలో ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుండి ఆయన రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి.