హైదరాబాద్: రామంతాపూర్ గోకుల్ నగర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం...దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుందనగా. ఘటన జరగడం దురదృష్టకరం, కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు, కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశాం, దర్యాప్తు నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశాలు జారీ చేశాం..అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.