మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ మహా జాతర నిర్వహణ కోసం రూ. 150 కోట్లు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం విశేషం. ఈ నిధులు జాతర నిర్వహణ, భక్తులకు మౌలిక వసతులు కల్పన, భద్రత ఏర్పాట్ల కోసం ఖర్చు చేయనున్నారు. జాతరకు వచ్చే లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. ఈ జాతరకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది.