తెలంగాణలో వరదల కారణంగా రూ.1,400 కోట్ల నష్టం
Rs 1,400 crore loss incurred due to floods in Telangana. తెలంగాణలో ఇటీవల వరదల కారణంగా రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా
By అంజి Published on 21 July 2022 10:26 AM ISTతెలంగాణలో ఇటీవల వరదల కారణంగా రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి తక్షణం రూ.1000 కోట్ల సాయం అందించాలని కేంద్రం కోరింది. కాజ్‌వేలు, రోడ్లు దెబ్బతిన్న కారణంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.498 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అలాగే పంచాయతీరాజ్ శాఖకు రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్తు శాఖలకు రూ.7 కోట్లు నష్టం వాటిల్లింది. ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ఆధారంగా నివేదికలు రూపొందించి కేంద్రానికి సమర్పించాయి. ఇళ్లు కూలిపోవడంతో పాటు బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం వల్ల జరిగిన నష్టాల కోసం ప్రభుత్వం మరో రూ.25 కోట్లు కోరింది.
ఇదిలావుండగా.. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత పోలవరం బ్యాక్‌వాటర్స్‌తో పాటు ఇతర సమస్యలతో తెలంగాణకు జరిగే నష్టంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (ఐ అండ్ క్యాడ్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. ''పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను అధ్యయనం చేయాలని కేంద్రానికి చాలాసార్లు నివేదించాం. కానీ స్పందించలేదు'' అని బుధవారం అని రజత్ కుమార్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల వరకు భూమి నీటమునగడమే కాకుండా పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు చారిత్రక ప్రదేశాలకు ప్రమాదం ఏర్పడుతోందని. పుణ్యక్షేత్రాలు, భద్రాచలం, పర్ణశాల కూడా నీట మునిగే అవకాశం ఉందన్నారు.
ఇటీవల రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలను ప్రస్తావిస్తూ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులకు కొంత నష్టం వాటిల్లిందని అన్నారు. కడెం, కాళేశ్వరం ప్రాజెక్టుల సమస్యలన్నింటినీ ఒక కమిటీ పరిశీలిస్తుంది. 100 ఏళ్లలో తొలిసారిగా రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఇంత భారీ వర్షాలు కురువగా, ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టు సమీపంలోని పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా ఇన్‌ఫ్లోలు వచ్చాయి, తద్వారా ఇంజనీర్లు అన్ని గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.
వర్షాకాలం రాకముందే కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టడం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదని రజత్‌కుమార్ తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన అన్నారు.