తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణాతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కోరారు. మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులు కూడా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపారు. ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని అన్నారు.
తెలంగాణలో జూన్ 29న 485 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో అత్యధికంగా 257 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత సంగారెడ్డి (73), రంగారెడ్డి (58), మేడ్చల్ మల్కాజిగిరి (37) కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,00,476కి చేరింది. ఇందులో 7,91,944 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,421 యాక్టివ్ కేసులు ఉన్నాయి.