తెలంగాణలో మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మొంథా తుఫాన్ కారణంగా లక్షా 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా నాగర్ కర్నూల్ 23,580, వరంగల్‌లో 19,736, ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించాలని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మరో వైపు మొంథా తుఫాన్ ప్రభావితులకు సహాయక చర్యలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ వల్ల నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు రూ.12.99 కోట్ల తక్షణ సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.