హైదరాబాద్: వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావుతో కలసి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలి. వర్షాల పట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో రక్షణ చర్యల చేపట్టాలి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి..అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.