జడ్చర్ల దగ్గర రోడ్డు ప్రమాదం, మంటలు చేలరేగి దగ్ధమైన బస్సు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  15 July 2024 8:50 AM IST
road accident, jadcherla, andhra Pradesh, bus,  fire,

జడ్చర్ల దగ్గర రోడ్డు ప్రమాదం, మంటలు చేలరేగి దగ్ధమైన బస్సు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రాదంలో బస్సులో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయ్యింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురయింది. అయితే.. బస్సు, డీసీఎం వ్యాను ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులంతా ముందుగానే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

ఆంధ్రప్రదేశ్‌ శ్రీసత్యసాయి జిల్లాలోని ఆర్టీసీ డిపోకు చెందిన లగ్జరీ బస్సు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఏపీకి బయల్దేరింది. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దు డీసీఎం వాహనం యూటర్న్ తీసుకుందుకు ఒక్కసారిగా వచ్చింది. ఆ క్రమంలో బస్సు, డీసీఎం డీకొన్నాయి. అదుపుతప్పిన బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తం అయిన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అప్పటికే మంటలు బస్సులో అంటుకున్నాయి. క్రమంగా ఎక్కువై మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే బస్సు మంటల్లో ఆహుతైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారనీ.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. గాయపడ్డవారిలో హైదరాబాద్, అనంతపురం జిల్లాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు.

Next Story