Accident in Shadnagar: నార్సింగి యాక్సిడెంట్‌ని తలపించేలా మరో ఘోర ప్రమాదం

షాద్‌నగర్‌ మల్లికార్జున కాలనీలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థిని ఓ బైకర్‌ ఢీ కొట్టాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  5 July 2023 1:56 PM IST
Road accident, Shadnagar, biker hit a student, Crime news

Accident in Shadnagar: నార్సింగి యాక్సిడెంట్‌ని తలపించేలా మరో ఘోర ప్రమాదం

వాహనదారుల ర్యాష్‌ డ్రైవింగ్‌ డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరు వాహనదారుల్లో ఏ మార్పు కనిపించకుండా పోతోంది. హైదరాబాద్‌ నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే హైదరాబాద్‌ పరిసరాల్లో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లో చోటు చేసుకున్న ఘటన.. నిన్న ఉదయం జరిగిన నార్సింగి యాక్సిడెంట్‌ని తలపించింది.

షాద్‌నగర్‌ మల్లికార్జున కాలనీలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థిని ఓ బైకర్‌ ఢీ కొట్టాడు. నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీసరస్వతి శిశుమందిర్‌ ఎదుట నుంచి విద్యార్థులు సాయంత్రం కాలినడకన ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా బైక్‌పై దూసుకొచ్చిన ఇద్దరు ఆకతాయిలు.. రోడ్డుపై నుండి వెళ్తున్న విద్యార్థిని ఢీకొట్టారు. దీంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన యువకులు అక్కడి నుండి పరారయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. విద్యార్థిని వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం విద్యార్థిని చికిత్స పొందుతోంది. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీశైలం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. పోలీసుల సరైన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే యువత నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

Next Story