వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్.. వరంగల్ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం ఉదయం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తుఫాను వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఆటో నుజ్జునుజ్జయింది. మృతులను మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 19 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గొండి మండలం రంగాపురం గ్రామానికి మిర్చి పంట కోసేందుకు ఆటోలో బయలు దేరగా ఈ ప్రమాదం జరిగింది.