తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
Rising black fungus cases in Telugu States.ఓ వైపు కరోనా మహమ్మారితో దేశమంతా అల్లాడిపోతుంటే.. దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కరోనా బాధితులను అల్లాడిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 18 May 2021 10:05 AM ISTఓ వైపు కరోనా మహమ్మారితో దేశమంతా అల్లాడిపోతుంటే.. దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కరోనా బాధితులను అల్లాడిస్తోంది. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా బ్లాక్‌ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.
గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో సుమారు 100 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి సమీపంలోని ఓ కార్పొరేటు ఆస్పత్రిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. మ్యుకర్ మైకోసిస్ వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతుండడంతో అధికారిక రికార్డుల్లోకి ఎక్కడం లేదు. ఇక ప్రకాశం జిల్లా మర్కాపురంలో అయిదు బ్లాక్ పంగస్ కేసులు బయటపడ్డాయి. గత నెల రోజుల వ్యవధిలో వీరిలో ఈ లక్షణాలు గుర్తించనట్లు మార్కాపురం జిల్లా వైద్యశాల డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాహుల్ తెలిపారు. ఇద్దరు జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నారు. ఇంకొకరు నంద్యాలలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నట్లు వివరించారు.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్‌ఫంగస్‌తో మృతిచెందారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 16 మంది చికిత్స పొందుతున్నారు. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది చనిపోయారు. బ్లాక్‌ఫంగస్ కేసుల చికిత్సకు వీలుగా ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ఈ కేసులకు సంబంధించి కచ్చితమైన నిర్ధారణ కోసం కొందరి నమూనాలను బయాప్సీకి పంపారు. అలాగే, బ్లాక్‌ఫంగస్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు.
వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోంది..
కరోనా వచ్చి తగ్గిన వారిలో... వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందువల్ల కరోనా తగ్గినా కూడా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుందనే కోణంలో వారిని పరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నల్లటి పదార్థం బయటికి రావడం, ముక్కు లోపల వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.