రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, తాను తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో మహిళా సంఘాల కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాముల్లో నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పచెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసకుంటున్న కొందరు మిల్లర్లు పందికొక్కుల్లా వాటిని కాజేస్తున్నారని, వాటిని తిరిగి ఇవ్వడం లేదని, లెక్కలు చెప్పడం లేదని సీఎం విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణం మహిళా సంఘాలు చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణాలకు అవసరమైన రుణాలు ఇప్పిస్తుందని సీఎం తెలిపారు. మహిళా సంఘాలు తమపై కాళ్ల నిలబడినప్పుడే తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సెర్ప్ సీఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు.