హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగనే.. భారీ బందోబస్తు నడుమ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఎర్రవల్లి రైతులతో రచ్చబండకు వెళ్తుండగా రేవంత్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బలవంతంగా రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ దగ్గర రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని పోలీసులు తోసేశారు. కింద పడడడంతో మల్లు రవికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో మల్లు రవి చొక్క చినిగిపోయింది. మల్లు రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెళ్లికి వెళ్తానని, అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.