అనర్హులని తేలితే అంతే సంగతులు..ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నాకూడా అనర్హులని తేలితే వాటిని రద్దుచేస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 10 March 2025 8:16 PM IST
అనర్హులని తేలితే అంతే సంగతులు..ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి మూడవ వారంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా.. మంత్రి మాట్లాడుతూ జనవరి 26వ తేదీన మోడల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన 562 గ్రామాల్లో ఎదురైన పరిస్ధితులు, మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటివరకు ఎదురైన సమస్యలను అంచనా వేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అర్హతగల లబ్దిదారులను గుర్తించడంలో పకడ్బందీగా వ్యవహరించాలి. వీలైనంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నాకూడా అనర్హులని తేలితే వాటిని రద్దుచేస్తామని ప్రకటించారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసిన సమయంలోనే వారి అర్హతలను నిర్ధారించగలగాలి, దీనివలన సమయంతోపాటు అర్హులకు న్యాయం జరుగుతుంది. అర్హతలేని వారు లబ్దిదారుల జాబితాలో చేరకుండా ప్రాథమిక స్ధాయిలోనే గుర్తించాలి.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..అని మంత్రి పొంగులేటి అన్నారు. అర్హులైన వారు ఇండ్లు పొందలేదని ఫిర్యాదులు ఉంటే క్షేత్రస్ధాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ఇండ్ల మంజూరులో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా అధికారులు పనిచేసి అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి పారదర్శకంగా జాబితాను తయారు చేయాలి. ఏ దశలోనూ అనర్హులకు మంజూరు చేశామన్న మాటే రాకూడదు..అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.