తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే మద్యం ధరలను 20 నుంచి 25 శాతం పెంచింది. మందుబాబులు ఎంత పెంచినా తాగుతారని ఆబ్కారీ శాఖ అనుకుందేమో.. మందుబాబులు తాము తాగమన్నట్లు భీష్మించుకు కూర్చున్నారేమోనని అనిపిస్తోంది. ధరల పెంపునకు ముందు రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల కేసుల బీర్లు విక్రయించగా, పెరిగిన తర్వాత ఈ నెల 19 నుంచి 28 వరకు కేవలం 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. బీర్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రంగారెడ్డి జిల్లాలో అమ్మకాలు భారీగా పడిపోయాయి.
మద్యం ధరల పెంపునకు ముందు 1.86 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరగ్గా, కొత్త ధరల తర్వాత 1.84 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం మాత్రమే అమ్ముడయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్ ఎక్సైజ్ జిల్లాల్లో మద్యం విక్రయాల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. పెరిగిన ధరల దృష్ట్యా మద్యం వినియోగం కొంతమేర తగ్గిందని పలు వైన్ షాపుల యజమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల మొదటి పది రోజుల్లో మేడ్చల్ జిల్లాలో 85 వేల కేసుల బీర్లు విక్రయించగా, ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు 80 వేల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం ధరల పెంపు తర్వాత విక్రయాలు తగ్గినా ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల పరిధిలో రూ.315 కోట్ల ఆదాయం వచ్చింది.