గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఎప్పుడో చెప్పిన మంత్రి
ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:23 PM ISTఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. 15రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాల ఖరారు చేస్తామన్నారు. లబ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నాం అని తెలిపారు.
ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. నిరుపేదలకు4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నాం అన్నారు.ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవు, లబ్దిదారుల ఇష్టం మేరకు ఇల్లు నిర్మించుకోవచ్చు కనీసం 400 చదరపు గజాలు తగ్గకుండా లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలన్నారు. నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం దశల వారీగా లబ్దిదారులకు చెల్లింపులు ఉంటాయి అన్నారు. పునాదికి లక్ష, గోడలకు లక్షా 25వేలు, శ్లాబ్‌కు లక్షన్నర, పూర్తయితే లక్ష రూపాయిల చొప్పున బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు జరుగుతుందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందన్నారు. నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం అని తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో కనీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తాం అన్నారు.
ఇండ్లలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలిన్నారు. ప్రతి మండలంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు ఎఈ లు ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. దేశంలో తెలంగాణ మాత్రమే ఇంతటి భారీ గృహ నిర్మాణం చేపట్టి, 5 లక్షల సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తాం అన్నారు. తొలి విడత గా సుమారు 28 వేల కోట్ల రూపాయిల వరకు కోట్లు ఖర్చు కావచ్చు అని తెలిపారు. సుమారు 7,740 కోట్ల రూపాయిలను ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్‌లో కేటాయించాం అన్నారు. అవసరమైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతాం, నిధులను వివిధ మార్గాలద్వారా సమీకరిస్తాం అన్నారు.
మరో నాలుగేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి
రాష్ట్రంలో సిఎం మార్పు అనేది ఉండదు.. మరో నాలుగు సంవత్సరాల ఒక నెల రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.