సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లూ అనామకులే : రేవంత్‌రెడ్డి
Revanth Reddy Speech in Karimnagar.హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అక్కడి రాజకీయం
By తోట వంశీ కుమార్ Published on 24 Oct 2021 12:50 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది. నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను స్థానికేతరుడు అని మంత్రి కేటీఆర్ అనడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు తమ నియోజకవర్గాలకు అనామకులేనని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అంటున్నారు.. మరీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో పోటి చేసిన వారు స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో పోలీసులను నిజాయతీగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. హుజూరాబాద్‌ను టీఆర్ఎస్, బీజేపీ వ్యసనాలకు అడ్డాగా మార్చాయన్నారు. పంపకాల్లో తేడా వల్లే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చిందన్నారు.
దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదన్నారు. సిద్దిపేటలో దళిత బంధు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. భయపెట్టి ఓట్లు పొందేందుకు హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డీజీపీ ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో టీఆర్ఎస్‌లో ముసలం రావడం ఖాయం అని రేవంత్ రెడ్డి అన్నారు.