ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పార్టీ అధిష్టానం టచ్‌లో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధిష్టానంపై గత కొంతకాలం నుంచి పొంగులేటి గుర్రుగా వున్నారు. పొంగులేటితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరిపుతున్నారని రేవంత్ చెప్పారు. హైకమాండ్ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించిందన్నారు. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో విసిగి వేసారిపోయిన నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరతారని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు కూడా ఆయన గైర్హాజరయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్‌ఎస్‌లో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణపై పిలుపునిచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో క్యాడర్‌తో వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. ఆయన బీజేపీలో చేరతారని, అమిత్ షాతో భేటీ అవుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అది ఇంకా జరగకపోవడంతో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలు వచ్చాయి. మరి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు ఈ సంవత్సరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సమయంలో పొంగులేటి వైఖరి ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు.