తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రముఖ కళాకారుడు రుద్రరాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా కొత్త రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి సూచించారు.
తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన 2014లో తీసుకుని వచ్చిన చిహ్నం స్థానంలో కొత్త చిహ్నం రానుంది. జూన్ 2న 10వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. అందులో తెలంగాణ చిహ్నం మార్పు ఒకటి. ఇక రోడ్డు రవాణా విషయంలో 'TS' స్థానంలో 'TG'తో భర్తీ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.