కుల మతాల సామరస్యం కోసం సద్బావన యాత్రను చేపట్టి చార్మినార్ ప్రాంతాన్ని రాజీవ్ గాంధీ పునీతం చేసారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ దేశం వందల కులాలు, మతాలతో కూడుకున్న వసుదైక కుటుంబమని.. ఈ దేశ సమైఖ్యతకు ఇందిరా గాంధీ తన ప్రాణాలు అర్పించారని రేవంత్ అన్నారు. కుల, మతాలను రెచ్చగొట్టి ఒక పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తే.. దేశ సమైఖ్యత కోసం రాజీవ్ గాంధీ దేశం మొత్తం సద్బావన యాత్ర చేపట్టారని అన్నారు. ప్రాంతాలు, మతాల ముసుగులో కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చి విర్రవీగుతున్నాయని మండిపడ్డారు.
కర్ణాటక సీఎంగా మైనారిటీల జీవితాలలో వెలుగు నింపిన వ్యక్తి వీరప్పమొయిలీ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ హాయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పాల్గొన్నారు.