టీఆర్ఎస్ చెరువుకు గండి పడింది.. ఇక చేవెళ్ల బస్టాండే గతి..
Revanth Reddy Fires On CM KCR. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ జాతీయ స్థాయిలో జరుగుతున్న
By Medi Samrat Published on 18 Dec 2021 7:38 PM ISTదేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ జాతీయ స్థాయిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్‌కు అచ్చోచింది.. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంపీటీసీ కావలి సుజాత టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. టీఆర్ఎస్ చెరువుకు గండి పడిందని.. ఇక చేవెళ్ల బస్టాండే గతి అని ఎద్దేవా చేశారు. ఈ పాదయాత్రలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ పాల్గొనడం విశేషం.
8 ఏళ్లుగా దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లు పాలన సాగిస్తున్నారని.. 2014 లో 60 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంటే ఇప్పుడు 108 లీటర్ అయ్యిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేతిలో డబ్బులు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవని.. ఇప్పుడు సంచిలో డబ్బు తీస్కుకొని పోతే చేతిలో సరుకులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారని.. అంటే ఇప్పటికి 14 కోట్ల ఉద్యోగాలు రావాలని దుయ్యబట్టారు.
పెట్రోల్ లీటరుకు 60 రూపాయలు, గ్యాస్ 400 సిలిండర్ ఉంటే.. మిగతా అంత కేసీఆర్, మోదీలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రూ.400 ఉన్న సిలిండర్ వెయ్యి రూపాయలు చేశారని.. 30 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్నాయని విమర్శించారు. పండించిన పంటలకు ధరలు లేవు.. అమ్మబోతే అడవి, కొనపోతే కొరివి అయ్యిందని.. వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులకు అన్యాయం చేసారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన వాళ్ళు అబివృద్ది కోసం పార్టీ మారాం అంటున్నారు.. వాళ్ళను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని కేసీఆర్ అన్నాడు. అగ్గి పుట్టియ్యలేదు కానీ ఫామ్ హౌస్ లో పండుకొని పెగ్గు తాగిండని తీవ్ర విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని.. కాంగ్రెస్ కు ప్రజలంతా అండగా ఉండాలని రేవంత్ కోరారు.