క్రమశిక్షణ తప్పి సీఎం మాటలు నిజం చేయొద్దు
Revanth Reddy Fires On CM KCR. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంపల్లిలో జరుగుతున్న డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు
By Medi Samrat Published on 9 Nov 2021 1:42 PM ISTకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంపల్లిలో జరుగుతున్న డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సు ఏర్పాటుచేశామన్నారు. ఎంత మంది నాయకులు పోయినా.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అని తెలిపారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని.. బీజేపీ, టిఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేనని విమర్శించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు అని.. క్రమశిక్షణ కాంగ్రెస్ లో ముఖ్యం.. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేనని.. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయ్యిందని.. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని అన్నారు. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని.. కష్టపడే కార్యకర్తలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని.. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.