చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు నిండాలంటే కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రామగుండంలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకుని ఇక్కడి ఎమ్మెల్యే బంధిపోటు దొంగలా మారిండని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతుండు కాబట్టే మళ్లీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించిండన్నారు. సింగరేణి కార్మికుల ఎన్నికలను కోర్టుకు పోయి వాయిదా వేయించిండ్రన్నారు. కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదు? అని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ జరగాలన్న, ఉద్యోగాల భర్తీ జరగాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
ప్రతీ నెలా రేషన్ సన్న బియ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. బిల్లు చూడగానే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి.. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాని తెలిపారు. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు.. రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తామని తెలిపారు. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.